జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్):
రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ద్వారా అందే వివిధ సేవల ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. సవరించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా కుల, ఆదాయ, జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం చేసే దరఖాస్తు రుసుమును గతంలో ఉన్న 45 రూపాయల నుండి 80 రూపాయలకు పెంచారు.
దాదాపు 15 ఏళ్ల తర్వాత మీ సేవ చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో పాటు మీ సేవ నిర్వాహకుల వాటాను కూడా 70 శాతానికి పెంచారు. ముద్రణ చార్జీలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, ఇతర సేవల పైన కూడా ధరల పెంపు ప్రభావం పడనుంది.
చార్జీల పెంపు పట్ల మీ సేవ సమాఖ్య హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపింది. అయితే, ఒక్కసారిగా చార్జీలు పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు మరియు నిరుద్యోగులపై ఆర్థిక భారం పడనుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.