జహీరాబాద్ వశిష్ట డిగ్రీ కళాశాల 15 వసంతాల వేడుకలు

నైపుణ్యానికి వేదిక.. ప్రగతికి నిలువుటద్దం.. మా వశిష్ట 15 ఏళ్ల సంబరం!

G Narsimulu
Highlights
  • 15 వసంతాల వశిష్ట: విద్యలో మేటి.. విలువలలో సాటి!

ఏప్రిల్ 4:(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం )
స్థానిక వశిష్ట డిగ్రీ కళాశాల స్థాపించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశిష్ట అతిథిగా ప్రముఖ కవి, రచయిత డాక్టర్ పెద్దగొల్ల నారాయణ విచ్చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ కాశీనాథ్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని కోరారు. తన స్వంత అనుభవాలను పంచుకుంటూ, మహారథి ఐపీఎస్ స్ఫూర్తితో విద్యార్థులు ఐపీఎస్, ఐఏఎస్ వంటి ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కాలేజీకి పంపిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టి మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. నేటి కాలంలో యువత క్రికెట్ బెట్టింగ్‌లు, సోషల్ మీడియా వ్యసనం వంటి వాటికి దూరంగా ఉండి, సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు.మరో అతిథి డాక్టర్ పెద్దగొల్ల నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాహిత్యం, సామాజిక స్పృహ కలిగి ఉండాలని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని కోరారు. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల తరపున బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రతి ఏటా ఉత్తమ మార్కులు సాధించే విద్యార్థులకు బంగారు పతకాలను అందజేస్తామని కళాశాల ప్రధానాచార్యులు ప్రకటించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఉప సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిద్దారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మారుతి రావు, డైరెక్టర్లు అమర్నాథ్, సంజీవరావు, శంకర్ రావు మరియు అధ్యాపకులు కృష్ణ, శ్రీనివాస్, శిల్ప, సంగన్న, లత తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఆటలు, నాటికలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Share This Article
19 Comments