అసెంబ్లీ వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు: గండిపేటలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్‌షాప్

Swathi Digital News

G Narsimulu

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యశాల మంగళవారం ప్రారంభమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా హాజరయ్యారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద తదితరులు పాల్గొని సభా మర్యాదలు, రూల్ బుక్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సభలో ప్రశ్నలు అడిగే విధానం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో రాజ్యాంగబద్ధమైన నిబంధనలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రజాప్రతినిధులకు వివరించారు.కాసేపట్లో ప్రారంభం కానున్న తదుపరి సెషన్లలో కౌన్సిల్ వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తమ అనుభవాలను పంచుకోనున్నారు. సీనియర్ నాయకులు వేర్వేరు అంశాలపై శిక్షణ ఇవ్వనుండగా, ముగింపు సెషన్‌లో కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. రాబోయే పదిహేను రోజుల పాటు అసెంబ్లీలో అనుసరించాల్సిన కార్యాచరణను ఈ వర్క్‌షాప్‌లో ఖరారు చేయనున్నారు.

Share This Article
42 Comments