ఏప్రిల్ 24 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల
జహీరాబాద్ రవాణా సంస్థ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న కార్మికులకు ఎమ్మెల్యే మాణిక్ రావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని మాణిక్ రావు మండిపడ్డారు. రెండున్నర ఏళ్లుగా ఎంతో ఓపికతో నిరీక్షించిన కార్మికులు, చివరకు గత్యంతరం లేకనే సమ్మె బాట పట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న పొన్నం ప్రభాకర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి, కార్మికులను తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
రవాణా సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత డ్రైవర్లు, కండక్టర్లపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఆస్తులను, భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని, కానీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి మాత్రం సమ్మతించడం లేదని విమర్శించారు.
గతంలో రవాణా సంస్థకు కేటాయించిన 200 కోట్ల రూపాయల నిధులు నేటికీ అందలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన బస్సులకే నేడు కొత్తగా జెండా ఊపి ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలని కోరారు. కొత్త సిబ్బందిని నియమించకపోవడంతో పాత వారిపై భారం పెరుగుతోందని, సమ్మె కాలంలో అనుభవం లేని వారితో బస్సులు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. కార్మికుల పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, కోహిర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు, ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షుడు యాకూబ్, మున్సిపల్ కౌన్సిలర్లు గౌస్ గౌరీ, దీపక్, విశ్వేశ్వర్, ప్రవీణ్, సర్పంచ్‌లు మచ్చేందర్, మోహన్ రాథోడ్, రాథోడ్ భీమ్ రావు నాయక్, బాల్ రాజ్, దేశెట్టి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
