జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్): సమాజ గమనంలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్ల సేవలు వెలకట్టలేనివని జహీరాబాద్ టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వినాయక్ కుమార్ కొనియాడారు. డ్రైవరన్నా నీకు సలాం అంటూ వారు పడే కష్టాలను, వారి బాధ్యతాయుతమైన వృత్తిని అభినందిస్తూ ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ కంటిమీద కునుకు లేకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ ఊరు కాని ఊరు తిరుగుతూ ప్రయాణికులను సురక్షితంగా చేరవేసే డ్రైవర్ల త్యాగం గొప్పదని, ఇంజిన్ సెగను మరియు కాళ్ల నొప్పులను భరిస్తూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా గమ్యం చేరే వరకు విశ్రమించని పోరాట యోధులు డ్రైవర్లని ప్రశంసించారు. రాత్రి పగలు ఎండ వాన అని చూడకుండా ఏ అడ్రస్‌కైనా ఏ తీర్థయాత్రకైనా సమయానికి చేర్చే నిబద్ధత వారి సొంతమని, తనిఖీలు చేసినప్పుడు పోలీసులకు సహకరిస్తూ పక్కాగా పత్రాలు చూపిస్తూ క్రమశిక్షణతో వ్యవహరించడం అభినందనీయమని పేర్కొన్నారు. చదువు తక్కువైనా ఎన్నో భాషలు మాట్లాడుతూ మనుషులను మరియు సరుకులను క్షేమంగా చేర్చే ఏకైక వ్యక్తి డ్రైవర్ అని, అటువంటి డ్రైవర్ సోదరులందరికీ తన హృదయపూర్వక సెల్యూట్ తెలియజేస్తున్నానని ఎస్‌ఐ వినాయక్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు.
డ్రైవరన్నా.. నీకు సలాం: డ్రైవర్ల సేవలను కొనియాడిన జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ వినాయక్ కుమార్
డ్రైవరన్నా.. నీకు సలాం: డ్రైవర్ల సేవలను కొనియాడిన జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ వినాయక్ కుమార్