ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) పిలుపులో భాగంగా జహీరాబాద్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను అమలు చేయాలని వారు కోరారు. ముఖ్యంగా 2026 జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీని ప్రకటించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, వారితో పాటు ప్రస్తుత ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేసి అమలు చేయాలని అభ్యర్థించారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారికి వెంటనే ఓపీఎస్ వర్తింపజేయాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. త్వరలో జనాభా లెక్కల కార్యక్రమం ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి, రాష్ట్ర బాధ్యులు బస్వరాజ్, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు శ్రీ పాల్, మల్లయ్య స్వామి, విజయ్ కుమార్, చంద్రశేఖర్, రాజు నాయక్, రమేష్, ఉమేష్, అంజయ్య, ఎస్జీటీయూ నాయకులు దయాకర్, విశ్వనాథ్, షకీల్, రాజేంద్రప్రసాద్, జీపీఓ నాయకులు ఖాజా, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.