సదాశివపేట (స్వాతి డిజిటల్ న్యూస్): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) పిలుపులో భాగంగా శుక్రవారం సదాశివపేటలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జేఏసీ నాయకులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2026 జూన్ 2వ తేదీ నాటికి కొత్త పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంతో పాటు, ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్య సేవల కోసం హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో జనాభా లెక్కల ప్రక్రియ ఉన్నందున, నిలిచిపోయిన సాధారణ బదిలీలను వెంటనే చేపట్టాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు సబేర్ అలీ, యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శైలు, దివ్యాంగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బస్వరాజ్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు మధుసూదన్, ప్రభు ప్రభాకర్, టీచర్లు మరియు వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
