సదాశివపేట:
సదాశివపేట పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న హాజ్రత్ మహబూబ్ పాషా దర్గా ఉర్స్ ఏ షరీఫ్ జాతర సందర్భాన్ని పురస్కరించుకొని, సదాశివపేట మైనారిటీ గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక వసతులు, విద్యా సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
ఈ స్టాల్‌లో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, కాస్మెటిక్ కిట్స్, దుప్పట్లు, ప్లేట్లు మరియు గ్లాసులను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మొహ్సిన్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ఈ సౌకర్యాలన్నీ సంపూర్ణంగా, ఉచితంగా అందుతాయని వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను ప్రభుత్వం బాధ్యతగా తీరుస్తోందని ఆయన పేర్కొన్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, పేద మైనారిటీ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. జాతరకు వచ్చే భక్తులు, తల్లిదండ్రులు ఈ స్టాల్‌ను సందర్శించి అడ్మిషన్ల వివరాలను తెలుసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.