జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్):
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాణిక్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించడమేనని మండిపడ్డారు. భారత రాజ్యాంగానికి లోబడి, దేశ అత్యున్నత పార్లమెంట్ ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగాలు, కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం తేజస్వీ సూర్య అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
బీజేపీ ఎంపీలు మిడిమిడి జ్ఞానంతో తెలంగాణపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, అలాగే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తక్షణమే స్పందించి తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన సదరు ఎంపీతో పాటు బీజేపీ పార్టీ కూడా రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు